హైదరాబాద్, వెలుగు : ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలోని భూదాన్ భూముల్లో నిర్మించుకున్న ఇండ్ల కూల్చివేతల వ్యవహారంలో స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇప్పటికే పిటిషనర్లతో సహా అర్హులైన వారికి ఇండ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే వారికి అన్యాయం జరుగుతుందని పేర్కొంది.
వెలుగుమట్ల గ్రామంలోని భూదాన్ భూముల్లో నిర్మించుకున్న ఇండ్ల కూల్చివేతలపై బాధితులు టి.వెంకటనరసమ్మ మరో 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్ సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ప్రభుత్వ న్యాయవాది కాట్రం మురళీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లలోని ఆరుగురికి, పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, సొంత ఇల్లు ఉన్నందున ఐదుగురి అభ్యర్థనలను తిరస్కరించామని, మిగిలిన వారివి పెండింగ్‌లో ఉన్నాయని కోర్టుకు చెప్పారు.
కూల్చివేసిన వాటిలో వారి ఇండ్లు లేవన్నారు. కూల్చివేతల తర్వాత 311 పట్టాలను మంజూరు చేశామని, 101 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్లలో కొందరికి పట్టాలు జారీ చేయగా మరికొందరి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నందున్న ఈ దశలో స్టే ఇవ్వలేమని చెబుతూ.. విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేశారు.
